Online Puja Services

నాయనార్ల గాథలు - మూర్తి నాయనారు

18.223.209.98

నాయనార్ల గాథలు - మూర్తి నాయనారు | Nayanar Stories - Moorthy Nayanar
-లక్ష్మీ రమణ 

‘మధురై ’ - పదం ఎంత మధురమైనదో అక్కడున్న ఆదిదంపతులు అంత మధురమైన అనుగ్రహమూర్తులు.  అమ్మ మీనాక్షి , అయ్యవారు సుందరేశ్వరుడు.  పేర్లు వినగానే , సౌందర్యం మూర్తీభవించిన మిథునం అనిపిస్తుంది కదూ ! పాండ్య రాజైన తన భక్తుని కోసం అయోనిజగా ఆవిర్భవించి,  అతని కూతురై పెరిగి, వీరవనితగా లోకాలని గెలిచిన అమ్మ మీనాక్షి.  ఆమె సుందరేశ్వరుడై నిలిచిన శివుని చేపట్టడం, ఆ వివాహాన్ని అన్నగారి హోదాలో స్వయంగా శ్రీమహావిష్ణువు జరిపించడం ఆలయ ఆవిర్భావ కథనం!! 

ఈ మధురై పట్టణం , ఇక్కడి మీనాక్షీ అమ్మ చారిత్రిక  వైభవం అనన్య సామాన్యం. దాదాపు 2500 ఏళ్ళకి పైబడిన చరిత్ర అది. ఇంతటి  సుదీర్ఘ కాల గమనంలో ఈ దివ్యమైన ఆలయం పైన జరిగిన దాడులు , ఘాతుకాలూ , దండయాత్రలూ కూడా సామాన్యమైనవి కావు.  హిందూ సమాజాన్ని, విశ్వాసాలనీ, విధానాలనీ దెబ్బతీయాలని , సనాతన ధర్మాన్ని కూలదోయాలనీ జరిగిన కుట్రలు , కుతంత్రాలు, కూటమి దాడుల్ని తట్టుకొని, సగర్వంగా నిలబడిన దేవాలయం ఇది. భక్తుల విశ్వాసానికి, అమ్మ శక్తికి,  నిదర్శనంగా నిలబడిన ఆలయం. ఒకప్పుడు ఆ విధంగా సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలనుకున్న పరధర్మ ప్రభుద్ధులకి బుద్ధి చెప్పి, తిరిగి సనాతన ధర్మాన్ని స్థాపించిన భక్తుడు మూర్తి నాయనారు. 

మూర్తి నాయనారు మధుర పట్టణంలో, పాండ్య రాజులు పరిపాలిస్తున్న కాలంలో  జన్మించిన వైశ్యుడు.  ప్రతి నిత్యమూ గంధముతో లింగార్చన చేసేవారు. శివలింగానికి నిండుగా చందనము పూసి, త్రిపుండ్రములు రాసి ఆ రుద్రునికి శీతల సేవ చేసేవారు.  మధురలో వేంచేసి ఉన్న పాండ్య రాజుల ఆడపడుచు అమ్మ మీనాక్షి కనుసన్నలలో ఆ ప్రాంతమంతా శైవసంప్రదాయం గొప్పగా విలసిల్లేది. నిత్య శివారాధనలతో సస్యశ్యామలంగా ఉండేది. 

 అటువంటి సమయంలో ఒకసారి కన్నడ రాజులు మధురై మీద , దాడిచేసి పాండ్య రాజ్యాన్ని వశపరుచుకున్నారు.  వారు జైనావలంబీకులు. ఆ మతాన్నే ప్రజలందరూ అవలంబించాలని రాజాజ్ఞ జారీ చేశారు. రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలని దుర్మార్గంగా తమ మతంలోకి మార్చే పనికి తెగబడ్డారు. దానికోసం వారిని హింసించడానికి కూడా వెనుకాడలేదు.   ఆ సమయంలో మూర్తి నాయనారు తన ధర్మాన్ని తాను  మార్చుకోనని ఆ దుర్మార్గపు రాచరికానికి ఎదురు నిలిచారు.  నిత్యమూ ఈశ్వరునికి తాను చేసే చందన సేవని కొనసాగిస్తూ, నేను శివుని మాత్రమే సేవిస్తానని తెగేసి చెప్పారు.  దాని కోసం వాళ్ళు పెట్టె హింసలని సైతం సహించారే తప్ప, శివునికి చేసే చందన సేవని ఆపలేదు. 

రాజుగారు మూర్తి నాయనారుని ఎలాగైనా సరే, తమ మతం లోకి మార్చాలని నిర్ణయించారు. రాజ్యంలో ఎవ్వరూ కూడా మూర్తి నాయనారుకి చందనాన్ని అమ్మకూడదని ఆంక్ష విధించారు. మూర్తి నాయనారు దగ్గర చందన నిల్వలు నిండుకున్నాయి.  ఎంతగా ప్రయత్నించినా, ఆయనకి చందనం దొరకలేదు. రాజాజ్ఞకి భయపడి, అంగడిలో ఎవ్వరూ మూర్తి నాయనారుకి చందనం అమ్మలేదు.  దాంతో ఆయన ఈశ్వర సేవకి విఘాతం కలిగిందని తల్లడిల్లిపోయారు.  కన్నీటి పర్యంతమవుతూ, శివాలయానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఆయన కళ్ళల్లో నీరు, హృదయంలో బాధ కేవలం ఒకే ఒక్క విషయం గురించి ! “స్వామీ ! ఈశ్వరా .. . ఈ అరాచకపు మూకల పాలన ఇంకా ఎన్నాళ్ళు ! నీ సేవని అడ్డుకుంటున్న ఈ దుర్మార్గుల అరాచకం నుండీ మాకు విముక్తి లేదా ! మళ్ళీ శైవలంబకుల ధర్మ పాలన చూడలేమా” అని !  

 ఎలుగెత్తి ఈశ్వరుణ్ణి ప్రార్ధించారు. అక్కడ తాను నిత్యమూ గంధాన్ని అరగదీసే సాన కనిపించింది. ఆ సానకి తన చేతిని వత్తి పట్టి గంధం చెక్కని అరగదీసినట్టే, అరగదీయడం ఆరంభించారు.  మనసులోని బాధ నీరై, ఆయన శరీరమే చందనమై ఆ సానమీద గంధం తయారవుతోంది. చేతి చర్మం అరిగి, ఆలయమంతా రక్తం చిప్పిల్లింది.  కండ అరిగిపోయి ఎముకలు బయటపడ్డాయి.  అయినా, నాయనారు లెక్కచేయలేదు.  అసలు అది తన చెయ్యి అన్న సంగతి కూడా ఆయనకి స్పృహలో ఉన్నట్టు లేదు, ఎముక కూడా సగం అరిగిపోయింది.  

నాయనారు సాహసోపేతమైన  భక్తి చందన పరిమళం ఈశ్వరుణ్ణి తాకింది.  ఆ ఈశ్వరుని వాణి వినిపించింది.  “భక్తా  !అనితర సాధ్యమైన నీ సాహసోపేత భక్తికి సంతోషించాను. ఇక ఈ రక్త చందనమును చాలించు.  మీ బాధలన్నీ తొలగిపోతాయి. ఈ రాజ్యానికి నీవే రాజువై ధర్మ పరిపాలన చేయి.  సనాతన ధర్మాన్ని ఉద్ధరించి, ప్రజా రంజకుడవైన పరిపాలన చేసి నా సన్నిధికి చేరుకోగలవు” అని ఆ ఈశ్వరవాక్కు . ఆ వెంటనే నాయనారు చేతులు యధా స్థితికి చేరుకున్నాయి. 

ఆ రాత్రి దైవ సంకల్పము వలన అ కర్కోటకుడైన రాజు మరణించాడు. మరునాడు సంప్రదాయం ప్రకారం, పట్టపుటేనుగు తొండానికి ఒక పూలమాలనిచ్చి పంపించారు. ఆ సమయంలో శివార్చన కోసం ఆలయానికి వచ్చిన నాయనారుకి పాదాభివందనం చేసి, ఆ ఏనుగు నాయనారునే రాజుగా వరించింది. తన సవారీ చేయిస్తూ రాజప్రాసాదానికి తీసుకొచ్చింది. 

మూర్తి నాయనారు విభూదే పట్టాభిషేకానికి పరమపవిత్రమైన సంబారముగా,  రుద్రాక్షలే వజ్రాభరణాలుగా ,తన జటాజూటమే కిరీటముగా సింహాసనాన్ని అధిష్టించి ప్రజారంజకంగా పరిపాలన చేశారు.  శైవ సంప్రదాయాలను , సనాతన ధర్మాన్ని తిరిగి ప్రతిష్టించి, అంత్యాన శివ సాయుజ్యాన్ని పొందారు. 

భగవానుడే సర్వస్వమని ఆయనకీ సర్వవశ్య శరణాగతి చేసినపుడు , ఆయన్ని ప్రత్యేకంగా నాకిది కావాలని అడగాల్సిన అవసరం లేదు. కావలసినవన్నీ సమకూర్చి , కైవల్యాన్ని కూడా తానే  ప్రసాదిస్తాడు. అడగకుండానే మూర్తినాయనారుకి రాజ్యాన్నిచ్చి రాజుని చేసిన దయాళువు ఆ ఈశ్వరుడు. నాయనారు కథ మనలో నింపిన భక్తి సుగంధంతో పరమేశ్వరుని ఆరాధిద్దాం. ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాం . 

సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి దివ్య చరణారవిందార్పణమస్తు !! 

 

 

Nayanar, Stories, Moorthy, Murthy, Murty, 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi